భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

జామ తండాలో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ

జామ తండా లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేత..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని జామ తండాకు చెందిన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంగళవారం అందజేశారు. నెల్లికుదురులోని అమూల్య గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు సోమన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు సోమన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని సర్పంచ్ పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. చేయూత పెన్షన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వీరు, సీనియర్ నాయకుడు బిక్షపతి, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.