భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

మిర్తిపాడు సహా ఆరు గ్రామాల ప్రజలకు అలర్ట్

మిర్తిపాడు పరిధిలో ఐదు గంటలు విద్యుత్ సరఫరాకు అంతరాయం

భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలంలోని మిర్తిపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అక్వాన్ తుపాను నేపథ్యంలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టనుండటంతో ఈ నెల 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

33/11 కేవీ మిర్తిపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని మిర్తిపాడు, హుండేశ్వరపురం, బొబ్బిలంక, ములకలంక, జాలిమూడి, కాటవరం గ్రామాల్లో ఈ అంతరాయం ఉండనుంది. ఈ గ్రామాల్లోని గృహ, వాణిజ్య, వ్యవసాయ, ఆక్వా విద్యుత్ వినియోగదారులకు నిర్ణీత సమయంలో సరఫరా నిలిపివేయనున్నారు.

తుపాను ప్రభావంతో విద్యుత్ లైన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తోందని వెల్లడించారు.

ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం టౌన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. శామ్యూల్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అంతరాయాన్ని ఆయా గ్రామాల వినియోగదారులు ముందుగానే గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, పనులు సజావుగా పూర్తయ్యేందుకు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.