భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. సీఎస్‌కే మెంటార్‌గా కొత్త అవతారం

ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. సీఎస్‌కే మెంటార్‌గా కొత్త అవతారం

భార‌త్ స‌మాచార్, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్‌కు ఇది భావోద్వేగ క్షణం. పసుపు జెర్సీతో మైదానంలోకి వచ్చి తనదైన స్టైల్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రస్థానానికి అధికారికంగా ముగింపు పలికాడు. దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన ఆయన ఐపీఎల్ ప్రయాణం ముగిసింది. అయితే అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో తన అనుబంధాన్ని కొనసాగించనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి జట్టుకు టీమ్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. మధ్యలో 2016, 2017 సీజన్లలో సీఎస్‌కేపై నిషేధం విధించడంతో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడాడు. ఆ తర్వాత తిరిగి చెన్నై జట్టులోకి వచ్చి తన నాయకత్వంతో అద్భుతాలు సృష్టించాడు. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఐదు ఐపీఎల్ టైటిళ్లను సాధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు. తన ప్రశాంతమైన నాయకత్వం, ఒత్తిడిలోనూ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మ్యాచ్‌ను ముగించే ప్రత్యేక శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ధోనీ కొత్త బాధ్యతలపై సీఎస్‌కే యజమాని ఎన్. శ్రీనివాసన్ ప్రత్యేకంగా స్పందించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ధోనీతో తమ ప్రయాణం కొనసాగుతోందని, సీఎస్‌కే గుర్తింపులో ఆయన ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటారని పేర్కొన్నారు. 2008లో ధోనీని జట్టులోకి తీసుకోవాలని తాను పట్టుబట్టానని, అది తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటని గుర్తుచేసుకున్నారు. ధోనీతో తమ అనుబంధం కేవలం ట్రోఫీలకు మాత్రమే పరిమితం కాదని, ఆయన ఎప్పటికీ చెన్నై కుటుంబంలో భాగమేనని స్పష్టం చేశారు.

మరోవైపు, 2026 ఐపీఎల్ సీజన్‌లో గాయం కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఆయన ఆటగాడిగా కొనసాగుతారా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఇప్పుడు వాటన్నింటికీ తెరదించుతూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే మైదానంలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించకపోయినా, డగౌట్‌లో ఉంటూ యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేయనున్నారు. జట్టు వ్యూహాలు, ఆటగాళ్లకు సలహాలు, కీలక సమయాల్లో తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా సీఎస్‌కే విజయాల్లో భాగస్వామి కానున్నారు. మొత్తానికి ఆటగాడిగా ధోనీ శకం ముగిసినా.. చెన్నైతో ఆయన బంధం మాత్రం కొనసాగనుంది.