భారత్ సమాచార్, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదులుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) నవంబర్ 17న విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఈ తుఫాన్ మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా, నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గాలుల వేగం అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించారు.
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ కదలికలు, తీవ్రతలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ గమనం, ప్రభుత్వ సన్నద్ధతపై సమీక్షించారు. తీరప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేరవేయాలని, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో సమాచారం అందించాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో భయాందోళనలు తగ్గించి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక బృందాలు, పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలిన సందర్భాల్లో వెంటనే తొలగించి రవాణా, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలు కూడా వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.