భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మందితో భారీగా సిద్దిపేట సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని మండలాలు, గ్రామాల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజలను సభకు తరలించేలా కృషి చేయాలని సూచించారు.
ఇందిరమ్మ కుటుంబ బీమా ఆవిష్కరణ
సిద్దిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ బీమా కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారని రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కీలక ముందడుగు కానుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ‘చలో సిద్దిపేట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆవుల రాజిరెడ్డి కోరారు. సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.