భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

సుస్మితకు న్యాయం జరిగే వరకు పోరాటం: సిపిఎం

సుస్మిత మృతి కారకుడికి ఉరిశిక్ష విధించాలి: సిపిఎం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన సుస్మిత మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆమె మృతికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారస్వామికి కఠిన శిక్ష విధించాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్రపైనా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంగళవారం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా కుమారస్వామి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుస్మితను మోసం చేశాడని ఆరోపించారు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ, ఆ తర్వాత కులం పేరుతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడం లేదని చెప్పి వివాహానికి నిరాకరించాడని తెలిపారు. దీంతో సుస్మిత తీవ్ర మానసిక వేదనకు గురైందని సైదులు పేర్కొన్నారు.

గత రెండేళ్లలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, వేధింపులు, ఇబ్బందుల గురించి సుస్మిత రాసిపెట్టి మృతి చెందిందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, సుస్మితకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నిందితుడికి రక్షణ కల్పిస్తున్నారనే ఆరోపణలు కూడా ఆయన చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రేమ పేరుతో నమ్మించి దళిత యువతులను మోసం చేసే వ్యక్తులకు ఎవరూ మద్దతు ఇవ్వకూడదని సైదులు అన్నారు. ఈ ఘటనలో నిందితుడికి సహకరించవద్దని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కుమారస్వామికి ఉరిశిక్ష విధించడంతో పాటు, అతడి కుటుంబ సభ్యులకు కూడా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

సుస్మిత మృతికి న్యాయం జరగకపోతే దళిత సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.