భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. లక్షల్లో నష్టం..!

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. లక్షల్లో నష్టం..!

భారత్ సమాచార్, సిద్ధిపేట జిల్లా: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ ఓ కుటుంబాన్ని తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జరిగిన ప్రమాదంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో నగదు, బంగారు ఆభరణాలు, విలువైన పత్రాలు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన అక్కన్నపేట మండలం గుబ్బడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. లక్షల్లో నష్టం..!

గ్రామానికి చెందిన మెడబోయిన పోచయ్య కుటుంబం వ్యవసాయ పనుల కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఈ సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం దగ్ధమైంది. స్థానికులు గుర్తించేలోపే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి.

ఈ ప్రమాదంలో ఇంట్లో దాచుకున్న ₹.2.5 లక్షల నగదుతో పాటు తులం బంగారు గొలుసు పూర్తిగా కాలిపోయాయి. కుటుంబ సభ్యుల చదువుకు సంబంధించిన ధ్రువపత్రాలు, భూమి పాసుపుస్తకాలు, ఇతర ముఖ్యమైన పత్రాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. ఇంట్లోని గృహోపకరణాలు సైతం కాలిపోవడంతో బాధిత కుటుంబానికి భారీ నష్టం వాటిల్లింది.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. లక్షల్లో నష్టం..!

సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశీలించడంతో పాటు, జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.

కష్టపడి సంపాదించుకున్న నగదు, బంగారం, విలువైన పత్రాలు, ఇంటి సామగ్రి మొత్తం కోల్పోయి బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. ప్రభుత్వం స్పందించి తమకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పోచయ్య కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.