భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఘనంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు

న్యాయవాదుల సమక్షంలో మాజీ మంత్రి "కెప్టెన్ సాబ్" జన్మదిన వేడుకలు

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: BRS పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ MP కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ BRS పార్టీ లీగల్ సెల్ కన్వీనర్, మాజీ AGP కన్నోజు రామకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి కెప్టెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కన్నోజు రామకృష్ణ మాట్లాడుతూ.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరి సరిహద్దుల్లో సేవలు అందించారని గుర్తుచేశారు. 1965లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని కెప్టెన్‌గా దేశానికి సేవలందించారని తెలిపారు. సైన్యంలో పనిచేసిన అనుభవంతో పాటు రాజకీయాల్లోనూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగారని పేర్కొన్నారు.

BRS పార్టీలో సీనియర్ నాయకుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీకి, అధినేత KCRకు అండగా నిలిచారని రామకృష్ణ చెప్పారు. సింగాపూర్ గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు మంత్రిగా, MPగా, రాజ్యసభ సభ్యుడిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవలు అందించారని వివరించారు.

కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడు వొడితల సతీష్ కుమార్ కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించారని తెలిపారు. ఈ కుటుంబం ఎప్పుడూ పేదల సంక్షేమం, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తూ ముందుంటుందని కన్నోజు రామకృష్ణ అన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డి. ప్రవీణ్, జాల జ్యోతికుమార్, కే. దేవందర్, ఎం. ఏసుదాస్, జుమ్లా నాయక్, యాల్ల సూర్య ప్రకాష్ రెడ్డి, జి. రఘువీర్, పార్నంది ప్రవీణ్, విశ్వతేజ, ఆంజనేయులు, ఎం. సాయి, తిరుపతి నాయక్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.