భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ మండలంలోని పూల్ నాయక్ తండా–మీర్జాపూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికల వసతి గృహంలో ప్రభుత్వ సంక్షేమ సదుపాయాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులకు అందించాల్సిన బ్లాంకెట్లు, ఆహార సరఫరా, హాజరు వివరాలు, పాఠశాల ఆవరణలో చెట్ల నరికివేతకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని, వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డెమొక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు ఐదుగురు ఉన్నతాధికారులకు అధికారిక ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సంస్థ జిల్లా అధ్యక్షుడు పెందోట భూశంకరాచారి వెల్లడించారు.
సంస్థ జాతీయ చైర్మన్ ఐలేని శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 260 బ్లాంకెట్లను విద్యార్థినులకు పంపిణీ చేయకుండానే పంపిణీ చేసినట్లు సంతకాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బ్లాంకెట్లను బయట విక్రయించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా సీసీ కెమెరాలను నిలిపివేసి ప్రభుత్వానికి సంబంధించిన సరుకులను బయటకు తరలిస్తున్నారనే ఆరోపణలపైనా విచారణ జరపాలని కోరారు.
ఆహార సరఫరాలోనూ లోపాలున్నాయనే ఆరోపణలు
విద్యార్థినులకు ప్రతిరోజూ అందించాల్సిన సాయంత్రం అల్పాహారం సక్రమంగా అందడం లేదని, వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్లు ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందిస్తున్నారా? పాలు, బూస్ట్ తదితర పౌష్టికాహార పదార్థాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేస్తున్నారా? అనే అంశాలను పరిశీలించాలని కోరారు. గత మూడు నెలల ఆహార సరఫరా బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి వాస్తవాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఆన్లైన్ హాజరు, రిజిస్టర్ వివరాల్లో తేడా?
విద్యార్థినుల హాజరు విషయంలోనూ అనుమానాలు ఉన్నాయని సంస్థ తన ఫిర్యాదులో ప్రస్తావించింది. ఆన్లైన్ హాజరు వివరాల్లో 169 మంది మాత్రమే కనిపిస్తుండగా, పాఠశాల రిజిస్టర్లో మాత్రం 330 మంది హాజరు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఈ రెండు రికార్డులను పోల్చి చూసి విద్యార్థినుల వాస్తవ హాజరు ఎంత ఉందో నిర్ధారించాలని అధికారులను కోరింది. హాజరు వివరాల్లో తేడాలు ఎందుకు ఉన్నాయో విచారణ ద్వారా స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేసింది.
పది పెద్ద చెట్ల నరికివేతపైనా విచారణ కోరుతూ..
పాఠశాల ఆవరణలో ఉన్న సుమారు పది పెద్ద వృక్షాలను ఎలాంటి అనుమతులు లేకుండా నరికివేసి, వాటిని సుమారు ₹50 వేల వరకు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. చెట్ల నరికివేతకు అనుమతులు ఉన్నాయా? వాటిని తొలగించడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? విక్రయానికి సంబంధించిన వివరాలేమిటి? అనే అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్
ఈ ఫిర్యాదును జిల్లా కలెక్టర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ శాఖ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించినట్లు భూశంకరాచారి తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రత్యేక అధికారుల బృందాలతో పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. సిబ్బంది సమక్షం లేకుండా విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి నుంచి వాంగ్మూలాలు సేకరించాలని సూచించారు.
అదేవిధంగా బ్లాంకెట్ల కొనుగోలు, పంపిణీ వివరాలు, ఆహార సరఫరా బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, విద్యార్థినుల హాజరు రికార్డులు, సీసీ కెమెరాల దృశ్యాలు, చెట్ల తొలగింపు, విక్రయానికి సంబంధించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు కీలక రికార్డులు, సీసీ కెమెరాల దృశ్యాలు ఎలాంటి మార్పులు లేకుండా భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు.
విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు భూశంకరాచారి పేర్కొన్నారు. విద్యార్థినులకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ సదుపాయాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని, వారికి న్యాయం జరిగే వరకు తమ సంస్థ తరఫున ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తామని తెలిపారు.