భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మండల ప్రత్యేక అధికారి నీలిమ సూచించారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు, భీంరావుపల్లి గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ.. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని వివరించారు. ముఖ్యంగా బోరుబావుల్లో నీటిమట్టాలు తగ్గిపోయి, సాగు మధ్యలోనే బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో పంటలు దెబ్బతినడమే కాకుండా రైతులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయండి
ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును సాధ్యమైనంత వరకు తగ్గించాలని నీలిమ సూచించారు. తక్కువ నీటితో పాటు తక్కువ కాలంలో చేతికి వచ్చే పొద్దుతిరుగుడు, కుసుమ, జొన్న, శనగ, వేరుశనగ, పెసర, మినుము వంటి పంటలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని చెప్పారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకుంటే సాగు ఖర్చులు, నష్టాల ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చని వివరించారు.
అలాగే ఆయిల్‌పామ్‌తో పాటు టమోటా, వంకాయ, మిర్చి, బెండ, దోస, ఆకుకూరలు వంటి కూరగాయల పంటలను కూడా స్థానిక వాతావరణం, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా సాగు చేసుకోవాలని సూచించారు. పంటల ఎంపిక విషయంలో వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతులకు తెలిపారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలి
నీటి కొరతను ఎదుర్కోవడానికి వర్షపు నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి సూచించారు. రైతులు తమ పొలాల్లో వ్యవసాయ కుంటలు (ఫార్మ్ పాండ్లు) ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో కమ్యూనిటీ సోక్ పిట్లు, ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్లు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి పంపే అవకాశం ఉంటుందని వివరించారు.
వర్షపు నీటిని సమర్థంగా ఒడిసిపట్టుకొని భూగర్భ జలాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో సాగునీటి సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చని పేర్కొన్నారు. రైతులు నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసుకొని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేస్ బాయి, ఎంపీడీఓ తిరుపతి, మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్, విద్యుత్ ఏఈ స్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ స్వప్న, ఇరిగేషన్ ఏఈఈ సాయికుమార్, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి, పంచాయతీ కార్యదర్శులు జగదీష్, ముత్యం, వల్లూరు సర్పంచ్ వినోద్, ఉపసర్పంచ్ రేఖ మధు, భీంరావుపల్లి సర్పంచ్ కిష్ట జనార్ధన్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.