భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

హుస్నాబాద్ BRS నాయకుల ముందస్తు అరెస్టులు

హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు... ప్రభుత్వ తీరుపై కౌన్సిలర్ గాదెపాక రవీందర్ విమర్శలు..

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్‌కు చెందిన BRS నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని కౌన్సిలర్ గాదెపాక రవీందర్ ఖండించారు. అరెస్టయిన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో గత పదేళ్ల BRS పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గత పదేళ్లలో BRS ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో జరిగిన పనులపై సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో లెక్కలు తీయించాలని రవీందర్ కోరారు. రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి, ఖర్చు చేసిన నిధులు, పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు.

గతంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకే అభివృద్ధిని పరిమితం చేశారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ BRSను ఓడిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. విమర్శలు చేయడం కంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం: రవీందర్

హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు... ప్రభుత్వ తీరుపై కౌన్సిలర్ గాదెపాక రవీందర్ విమర్శలు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని గాదెపాక రవీందర్ విమర్శించారు. మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, రైతులకు ₹5 లక్షల బీమా వంటి హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

పెన్షన్లు రెట్టింపు చేస్తామని ప్రకటించి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీని అమలు చేయలేదని అన్నారు. అర్హులైన వృద్ధులు, చేనేత కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని విమర్శించారు. మరోవైపు పెన్షన్ల పంపిణీ తేదీని కూడా గతంలో 19వ తేదీ నుంచి 26వ తేదీకి వాయిదా వేశారని పేర్కొన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

గత ప్రభుత్వం ప్రారంభించిన పలు ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని రవీందర్ ఆరోపించారు. గతంలో చేపట్టిన పనులకే మళ్లీ ప్రారంభోత్సవాలు నిర్వహించడం కాకుండా, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కోరారు.

రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కౌన్సిలర్ గాదెపాక రవీందర్ సూచించారు.