భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేటలో పాల్గొననున్న భారీ బహిరంగ సభకు నార్సింగి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి దాదాపు 400 మంది ప్రత్యేక బస్సుల్లో సభకు బయలుదేరారు.
ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రధాన రోడ్డు వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతబట్టి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సుమారు 400 మంది సిద్దిపేటలో జరిగే ముఖ్యమంత్రి సభకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా యెన్నం రాజేందర్ రెడ్డి, అంచనూరి రాజేష్, యాదగిరి యాదవ్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి కాంగ్రెస్ పార్టీకి ఎంతో పవిత్రమైన రోజని అన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డపై నుంచి ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం సంతోషకరమని తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజాపాలన అందిస్తోందని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు లబ్ధి చేకూరుస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అందని సంక్షేమ ఫలాలు ప్రస్తుతం అర్హులైన ప్రజలకు అందుతున్నాయని, ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సిద్దిపేట సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలిరావడం కాంగ్రెస్ పార్టీపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అర్హులందరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తాం
ఇటీవల ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యెన్నం రాజేందర్ రెడ్డి తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరి పెన్షన్లు తాత్కాలికంగా నిలిచిపోయాయని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ జాబితాలో పేరు లేని వారందరికీ న్యాయం జరిగేలా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ అందేలా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్, మాజీ గౌడ సంఘం అధ్యక్షుడు చిన్న కృష్ణ గౌడ్, మోతీలాల్, సుధాకర్, గోవర్ధన్, కేశవులు, రుక్ముద్దీన్, జహీర్, బాలరాజు గౌడ్, ప్రభాకర్, రాజేశ్వర్ గౌడ్, చిన్న బాబు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.