భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్‌లో దీక్షా దివాస్ ఫ్లెక్సీ తొలగింపుతో వివాదం చోటుచేసుకుంది. ఈ నెల 29వ తేదీన హుస్నాబాద్‌లో BRS పార్టీ నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమానికి సంబంధించి అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో BRS కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
BRS నాయకులు రాత్రి అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివాస్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, ఉదయం కల్లా మున్సిపల్ సిబ్బంది దానిని తొలగించారు. దీంతో ఆగ్రహించిన BRS కార్యకర్తలు ఫ్లెక్సీ తొలగించిన మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం తొలగించిన ఫ్లెక్సీని తీసుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ సిబ్బంది దీక్షా దివాస్ ఫ్లెక్సీని తొలగించారని BRS కార్యకర్తలు ఆరోపించారు. తమ పార్టీ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని తొలగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్యకర్తలకు నచ్చజెప్పారు. పోలీసుల జోక్యంతో BRS కార్యకర్తలు ఆందోళన విరమించడంతో పరిస్థితి సద్దుమణిగింది.