భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి 30 రోజుల జైలు శిక్ష

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి నర్సాపూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తున్నాయని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ ఎస్సై ఏ. రంజిత్ రెడ్డి హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న ఎస్సై ఏ. రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి బైక్ నడుపుతున్న నర్సాపూర్‌కు చెందిన వడ్ల అన్నమాచారిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.

ఈ కేసులో నిందితుడిని గురువారం నర్సాపూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి వడ్ల అన్నమాచారికి 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా ఎస్సై రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారుడితో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ముఖ్యంగా యువత మద్యం సేవించి బైక్‌లు నడపవద్దని ఎస్సై సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మద్యం సేవించినప్పుడు వాహనం నడపకుండా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.