భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్

భారత్ సమాచార్, భక్తి : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇండియా పోస్ట్ తీపి కబురు అందించింది. ఇకపై స్వామివారి ప్రసాదాన్ని ప్రయాణంలో వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికే తెప్పించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇండియా పోస్ట్‌, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా శబరిమల సన్నిధానంలో నవంబర్ 17 నుంచి 24 గంటల పాటు పనిచేసే ‘స్వామి ప్రసాదం’ పార్శిల్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చాయి.

ఈ కౌంటర్‌ను దేవస్థానం బోర్డు నిర్వహించే అరవణ, అప్పం ప్రసాదాల పంపిణీ కేంద్రాల పక్కనే ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడ తమకు కావాల్సిన ప్రసాదాన్ని బుక్ చేసుకుని ఇంటి చిరునామా అందిస్తే సరిపోతుంది. ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ పార్శిల్ సేవ ద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా పంపిస్తారు. భక్తులు తిరుగు ప్రయాణంలో ప్రసాదం ప్యాకెట్లను మోసుకెళ్లాల్సిన ఇబ్బంది ఉండదు. సురక్షిత ప్యాకింగ్‌తో పార్శిళ్లను పంపించి, భక్తులు ఇంటికి చేరుకునే సమయానికి ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సేవలో భాగంగా అరవణ పాయసంతో పాటు విభూది, పసుపు, కుంకుమ, నెయ్యి, అష్టోత్తరార్చన ప్రసాదాలను కూడా పంపించుకునే అవకాశం ఉంది. కేవలం శబరిమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తమ సమీపంలోని ఇండియా పోస్ట్ కార్యాలయం ద్వారా కూడా స్వామివారి ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. బంధుమిత్రులకు కూడా ప్రసాదాన్ని పంపించే వెసులుబాటు ఉండటంతో ఈ సేవ మరింత ఉపయోగకరంగా మారనుంది.

శబరిమలలో మండల యాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా రద్దీ సమయంలో ప్రసాదాన్ని తీసుకెళ్లడం, ప్రయాణంలో భద్రంగా ఉంచుకోవడం కొంత ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యలను తగ్గించడంతో పాటు భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే కొత్త ఏర్పాట్ల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. గతంలోనూ ఇండియా పోస్ట్ ద్వారా శబరిమల ప్రసాదం పంపిణీ సదుపాయం ఉండగా, ఇప్పుడు సన్నిధానంలోనే 24 గంటల ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం విశేషం.