భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

జీనియస్ క్వెస్ట్‌లో మెరిసిన నార్సింగి, శేరిపల్లి విద్యార్థులు

మండల స్థాయి క్విజ్ పోటీల్లో శేరిపల్లి, నార్సింగి విద్యార్థుల ప్రతిభ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మెదక్ జిల్లా జీనియస్ క్వెస్ట్ కార్యక్రమంలో భాగంగా నార్సింగి మండల కేంద్రంలో హైస్కూల్ విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించారు. బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

నార్సింగి మండల కేంద్రంలో నిర్వహించిన పోటీల్లో పదో తరగతి విభాగంలో నార్సింగి హైస్కూల్ విద్యార్థిని టీ. హారిక ప్రథమ స్థానాన్ని సాధించారు. తొమ్మిదో తరగతి విభాగంలో అదే పాఠశాలకు చెందిన బి. మణికంఠ మొదటి స్థానంలో నిలిచారు. ఎనిమిదో తరగతి విభాగంలో శేరిపల్లి హైస్కూల్ విద్యార్థిని ఆర్. శాలిని ప్రథమ బహుమతిని గెలుచుకుని తన ప్రతిభను చాటుకున్నారు. మూడు విభాగాల్లోనూ విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించడంతో ఆయా పాఠశాలల్లో ఆనందం వ్యక్తమైంది.

మండల స్థాయి క్విజ్ పోటీల్లో శేరిపల్లి, నార్సింగి విద్యార్థుల ప్రతిభ

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ గంగాబాయి విజేతలను అభినందించారు. క్విజ్ పోటీలు విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఇలాంటి పోటీల ద్వారా పుస్తకాల్లోని అంశాలతో పాటు వివిధ విషయాలపై అవగాహన పెరుగుతుందని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు జీనియస్ క్వెస్ట్ వంటి కార్యక్రమాలు మంచి వేదికగా నిలుస్తాయని ఎంఈఓ పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సహకారం అందించిన బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మండల స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులు రానున్న జిల్లా స్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో పాల్గొని నార్సింగి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నార్సింగి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రవిచందర్, శేరిపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు తిరుపతి, కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.