భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఏపీ ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్..

ఏపీ ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్..

భార‌త్ స‌మాచార్, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం 2026-27 సంవత్సరానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సుమారు రూ.231.13 కోట్ల నిధుల వినియోగానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ నవంబర్ 17న G.O.Rt.No.142ను విడుదల చేసింది.

ఈ పథకం ద్వారా సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి, స్వయంగా వాటిని నడుపుకుంటూ జీవనం సాగించే డ్రైవర్లకు ప్రయోజనం కలుగుతుంది. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడనుంది. గతంలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద రూ.10,000 అందించగా, కూటమి ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పేరుతో ఈ మొత్తాన్ని రూ.15,000కు పెంచింది. 2025లో ఈ పథకం ప్రారంభమైనప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.90 లక్షల మంది డ్రైవర్లకు ప్రయోజనం చేకూరింది.

ఈ పథకం కింద అర్హత పొందాలంటే డ్రైవర్‌కు సొంత వాహనం ఉండటంతో పాటు, దానిని ఆయనే నడుపుతూ ఉండాలి. వాహనం ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయి ఉండటం, సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం వంటి నిబంధనలు వర్తిస్తాయి. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు సమర్పించిన వివరాలు, వాహన పత్రాలను పరిశీలించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది.

కాగా, 2026-27 సంవత్సరానికి రూ.231.13 కోట్ల నిధుల వినియోగానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చినప్పటికీ, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే తేదీని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించలేదు. దరఖాస్తుల ప్రారంభ తేదీ, చెల్లింపుల షెడ్యూల్‌పై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ఆటో, క్యాబ్ డ్రైవర్లు తదుపరి అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలి. తాజా సమాచారం, అర్హతల వివరాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.