భారత్ సమాచార్, స్పోర్ట్స్ : భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తనదైన ఆటతీరుతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తండ్రిలాగే దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అతడిని అభిమానులు సెహ్వాగ్‌తో పోలుస్తున్నారు. అయితే ఈ పోలికలపై ఆర్యవీర్ ఆసక్తికరంగా స్పందించాడు. తాను 'సెహ్వాగ్ 2.0'గా గుర్తింపు పొందేందుకు క్రికెట్లోకి రాలేదని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశాడు.
తండ్రితో పోలికలు రావడం సహజమేనని, కెరీర్ ప్రారంభంలోనే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నానని ఆర్యవీర్ తెలిపాడు. ప్రజలు తమ ఆటలో పోలికలు చూస్తే అది వారి అభిప్రాయమని, తన తండ్రిపై ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నాడు. అయితే రెండో సెహ్వాగ్‌గా మారడం కంటే తొలి ఆర్యవీర్ సెహ్వాగ్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికే ఇష్టపడతానని చెప్పాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడమే తన విధానమని, తాను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానినని కూడా వెల్లడించాడు.
ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్ 2026లో ఆర్యవీర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి 90.25 సగటుతో మొత్తం 361 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడమే కాకుండా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు.
ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఆర్యవీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 61 బంతుల్లో 58 పరుగులు చేసి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే తనదైన ముద్ర వేయాలని చూస్తున్న ఆర్యవీర్‌పై క్రికెట్ అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.