భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎన్నికల అవగాహన, క్విజ్, వ్యాసరచన పోటీల్లో నెల్లికుదురు పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. వివిధ పోటీల్లో ఉన్నత స్థానాలు సాధించిన విద్యార్థులకు శుక్రవారం కలెక్టరేట్‌లో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో పాఠశాలకు చెందిన ఎస్. దీక్షిత్, అమృతవర్షిణి 4వ స్థానాన్ని సాధించారు. అలాగే వ్యాసరచన పోటీల్లో పి. సిరివెన్నెల 6వ స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ టీచర్ అంజుమ్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు
జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు అన్నారు. పోటీలకు విద్యార్థులను సిద్ధం చేసి, వారికి మార్గదర్శకత్వం అందించిన గైడ్ టీచర్ పి. నవీన్ కుమార్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ప్రిన్సిపాల్ తెలిపారు. చదువుతో పాటు వివిధ పోటీల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొంటూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.