భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రైతులు వచ్చే వేసంగిలో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా విద్యాలయ శాఖ అధికారి జినుగు మరియన్న సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉండే పరిస్థితుల్లో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
మండలంలోని మునిగలవేడు గ్రామంలో శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న బెండ, వంగ, మిరప పంటలను పరిశీలించారు. పంటల సాగు విధానాలు, వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. ఉద్యాన పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్, మిరప, మల్బరీ సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలు, పంటల పెంపకంలో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు.
వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలి
వేసంగిలో వరి సాగుకు బదులుగా కూరగాయలు, మల్బరీ వంటి ఆరుతడి పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని మరియన్న సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయా పంటల సాగుకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనల కోసం రైతులు సమీప ఉద్యానవన అధికారులను సంప్రదించాలని చెప్పారు.
అలాగే ప్రభుత్వం అందిస్తున్న బిందు సేద్యం, మల్చింగ్ తదితర పథకాల రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుంటూ నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు వివరించారు.
ఈ క్షేత్ర సందర్శన కార్యక్రమంలో రైతులు నాగేశ్వరరావు, సంపత్ రెడ్డి, సీతారాములు, హరిసింగ్, నాగన్న, ఫీల్డ్ అధికారి నర్మద తదితరులు పాల్గొన్నారు.