భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

17 డిమాండ్లతో సీఎం రేవంత్‌కు ప్రజా సంఘాల వినతి

17 డిమాండ్లతో సీఎం రేవంత్‌కు ప్రజా సంఘాల వినతి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి 17 అంశాలతో కూడిన ప్రజా పత్రాన్ని అందజేసింది. నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిని కలిసి వివిధ రంగాలకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, ఆదివాసీలు, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా పత్రంలో ప్రధానంగా ప్రస్తావించారు. రైతులకు రుణమాఫీతో పాటు కరువు భత్యం అందించాలని, వడ్డీ లేని పంట రుణాలు మంజూరు చేయాలని, కౌలు రైతులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయాలని కోరారు. వాతావరణ మార్పుల కారణంగా పంట నష్టపోతున్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు UPSC తరహాలో అకడమిక్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని కోరారు. నూతన విద్యా విధానం-2020లో భాగంగా ప్రతిపాదించిన 10+2 విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. చేనేత పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలిచి కార్మికులకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలని సూచించారు.

ఆదివాసీలు, బీసీలు, మైనార్టీల హక్కులకు రక్షణ కల్పించాలి

ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు అందించడంతో పాటు PESA, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో ప్రకటించిన BC డిక్లరేషన్‌ను అన్ని రంగాల్లో అమలు చేయాలని కోరారు. ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులపై నమోదైన కేసులను ప్రత్యేక GO ద్వారా ఉపసంహరించుకోవాలని కోరారు. తెలంగాణ అమరవీరుల స్థూపాల నిర్మాణం, ఆవిష్కరణలకు ఎలాంటి ఆంక్షలు విధించకూడదని విజ్ఞప్తి చేశారు. మైనార్టీల హక్కులను పరిరక్షించడంతో పాటు వక్ఫ్ బోర్డు భూములను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

డంపింగ్ యార్డు, భూసేకరణ సమస్యలకు పరిష్కారం చూపాలి

హైదరాబాద్ పరిధిలోని బాలాజీనగర్ తదితర ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డు కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఫార్మా, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుల పేరుతో వ్యవసాయ భూములను సేకరించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కింద భూములు, నివాసాలు కోల్పోయి నిర్వాసితులైన ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరారు. అలాగే డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌ను తక్షణమే వాయిదా వేయాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేసింది.

ప్రజా ప్రభుత్వం అని ప్రకటించుకున్న ప్రభుత్వం ప్రజల సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా పత్రంలో పొందుపరిచిన 17 అంశాలపై తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ వంగల సంతోష్, PDSU (విజృంభణ) కన్వీనర్ పి. రాజేష్, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్‌నాథ్ లింగంపల్లి, బి. మణికంఠ, కే. రామ్‌చంద్రారెడ్డి, అరవింద్, ఉజైర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.