భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివస్ ఫ్లెక్సీ తొలగింపు వివాదం రగడకు దారితీసింది. ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై BRS నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ తొలగించిన ఫ్లెక్సీతోనే అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఫ్లెక్సీల తొలగింపు విషయంలో అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.
ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి BRS నాయకులు గురువారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీని తొలగించారు. దీంతో విషయం తెలుసుకున్న BRS నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం తొలగించిన ఫ్లెక్సీని తీసుకుని చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ పట్టణంలో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో మున్సిపల్ అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ నిబంధనలు BRS ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకే వర్తిస్తాయా..? అధికార పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఎందుకు ఇదే విధంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై నిబంధనలు ఉంటే వాటిని అన్ని పార్టీలకు సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ ఫ్లెక్సీలను తొలగించి, మరో పార్టీ ఫ్లెక్సీలను పట్టించుకోకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళన విషయం తెలుసుకున్న హుస్నాబాద్ ACP సదానందం, SI లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసన చేస్తున్న BRS నాయకులు, కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఘటనా స్థలానికి వచ్చి వివరణ ఇవ్వాలని నాయకులు పట్టుబట్టారు. దీంతో మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్ గౌడ్ అక్కడికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు.
తనకు తెలియకుండానే మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీని తొలగించారని కమిషనర్ తెలిపారు. ఫ్లెక్సీ తొలగింపునకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో BRS నాయకులు ఆందోళన విరమించారు.
ఈ నిరసన కార్యక్రమంలో BRS పట్టణ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి, కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, బొల్లి శ్రీనివాస్, వాల సుప్రజ, నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, కన్నోజు రామకృష్ణ, MD. అన్వర్, గూళ్ల రాజు, భూక్య లక్ష్మణ్ నాయక్, పచ్చిమట్ల సంపత్, పెరుమాండ్ల శ్రీనివాస్, యాస శ్రీనివాస్, కుతాటి విజయభాస్కర్, బూర వెంకన్న, భోజు రవీందర్, గడ్డం సదానందం, వాల నవీన్, మేకల వికాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.