భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి, జమ్మల తండా గ్రామాల్లో శనివారం వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, పంటల సాగుపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రైతులకు పలు సూచనలు చేస్తూ నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు.
దంతేపల్లి గ్రామంలో సర్పంచ్ మస్కూరి బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఎంపీడీవో షాజీలుద్దీన్, తహసీల్దార్ రజనీకుమారి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి వినియోగం, వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి వృథాను అరికట్టేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మేరకే వినియోగించుకోవాలని, భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు తలెత్తకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
రైతులు వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, శనగ వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా పంటల సాగుకు ఇబ్బందులు తగ్గించేలా పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వ్యవసాయ పనులు చేపట్టాలని రైతులకు సూచించారు.
ఈ గ్రామసభల్లో జమ్మల తండా సర్పంచ్ బన్షి నాయక్తో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.