భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని రామాయంపేట తహసీల్దార్ రజని కుమారి సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలోని TG సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలికల విభాగంలో శనివారం నిర్వహించిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో ఎంతో కీలకమైందని, ఈ సమయంలో అలవర్చుకునే క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలని, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తమ విజయాలతో తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతను గుర్తించి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు.
అలాగే చదువుతో పాటు క్రీడారంగంలోనూ ఆసక్తి చూపాలని, పట్టుదలతో సాధన చేస్తూ మంచి ప్రతిభ కనబరచాలని తెలిపారు. విద్య, క్రీడలు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చుతుందని పేర్కొంటూ వారికి దిశానిర్దేశం చేశారు.