భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన

ఎల్ నినో ప్రభావాలపై రైతులకు అవగాహన  తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిణి దీపిక సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అద్మాపూర్, జక్కపల్లి గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి దీపిక మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తుగా అప్రమత్తమై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఒకే రకమైన పంటల సాగుకు పరిమితం కాకుండా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి సంరక్షణ పద్ధతులను పాటిస్తూ వ్యవసాయం చేయాలని తెలిపారు.

ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి, వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండించే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. జొన్న, మొక్కజొన్న, పెసర, అలసంద, మినుము, శనగ, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆవాలు వంటి పంటలతో పాటు వివిధ కూరగాయల సాగుపై రైతులకు వివరించారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగులో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

అలాగే ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే విధానాలపై అవగాహన కల్పించారు. నీటిని వృథా చేయకుండా పంటలకు అవసరమైన మేరకు వినియోగించుకోవడం, నీటి సంరక్షణకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

రాబోయే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందేలా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో MPDO భారతి, MPO మహమ్మద్ మొజామ్ హుస్సేన్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్, ఉపాధి హామీ పథకం APO అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.