భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత సూచించారు. ఇరువర్గాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, దీనివల్ల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు.
జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సూచనలతో మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నేతృత్వంలో నర్సాపూర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంపై కక్షిదారులకు న్యాయమూర్తి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎం. హేమలత మాట్లాడుతూ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (ఎన్ఐ) చట్టం కింద నమోదైన చెక్ బౌన్స్ కేసుల్లో ఇరువర్గాలు పరస్పర అవగాహనతో ముందుకు వచ్చి రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. కేసుల విషయంలో ఒకరికొకరు పంతాలకు పోతూ కోర్టుల చుట్టూ తిరగడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతాయని పేర్కొన్నారు. అలా కాకుండా ఇరువర్గాలు చర్చించుకుని అంగీకారంతో సమస్యను పరిష్కరించుకోవడం మంచిదని తెలిపారు.
ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సులభమైన విధానంలో కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల ఇరువర్గాలకు న్యాయపరమైన ఇబ్బందులు తగ్గడంతో పాటు విలువైన సమయం ఆదా అవుతుందని వివరించారు. అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది డి. శ్రీధర్ రెడ్డి, మాజీ ఏజీపీ ఈ. సత్యనారాయణ, పి. సుధాకర్, సీనియర్ న్యాయవాది జాఫర్, ఏ. శ్రీనివాస్, న్యాయవాదులు ప్రభు, రవి నాయక్, రాధాబాయి, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.