భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆధునిక సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్తు అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో ఎఫ్‌పీజీఏ కనెక్ట్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు హాజరయ్యారు.
ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రేస్ (FPGA) టెక్నాలజీ ప్రాధాన్యత, వివిధ రంగాల్లో వాటి వినియోగాలు, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశాలపై ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా చర్చించారు. పరిశ్రమల్లో వేగంగా మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా AMD అడాప్టివ్ అండ్ ఎంబెడెడ్ కంప్యూటింగ్ గ్రూప్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ చురివాలా హాజరయ్యారు. ఆయనకు కళాశాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వానిక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ముద్దసాని సత్యనారాయణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే, డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీపతి, ECE విభాగాధిపతి డాక్టర్ సంజీవ రెడ్డి, ప్రొఫెసర్, డీన్ ఇన్నోవేషన్ డాక్టర్ ఎం.సి. చిన్నయ్య, AMD ప్రతినిధుల బృందం కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక విద్య అందించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రయోగాత్మక అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా పరిశ్రమల్లో ఉపయోగించే ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచించారు. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం పెరిగితే విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మైక్రోచిప్ సీనియర్ డైరెక్టర్ చౌదరి మన్సూరి, ఇంటెల్ ప్రతినిధి డాక్టర్ వై. అవినాష్, లాటిస్ సెమీకండక్టర్స్ ప్రతినిధి భాస్కర్ తదితర పరిశ్రమల ప్రముఖులు పాల్గొని సాంకేతిక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. FPGA టెక్నాలజీకి సంబంధించిన పరిశ్రమ అవసరాలు, భవిష్యత్తు అవకాశాలను వివరించారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి కళాశాల జనరల్ మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ సహకరించారు. ECE విభాగానికి చెందిన డాక్టర్ ముదస్సర్ బాషా, డాక్టర్ దివ్యవాణి, జె. కిషోర్, ఎం. అనూష, టి.పి. కౌసల్య, నందన్‌తో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పరిశ్రమల్లో అవసరమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన కల్పించడంతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు బీవీఆర్ఐటీ తన వంతు కృషి చేసింది.