భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి

మహా పాదయాత్రను విజయవంతం చేయాలి  బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి వీరాచారి పి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 23న కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి వీరాచారి పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ఆయన నివాసంలో గొల్లపల్లి వీరాచారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహా పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను కేంద్ర మంత్రితో కలిసి ఆవిష్కరించారు. పాదయాత్ర లక్ష్యాలు, నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు.

అనంతరం వీరాచారి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ (SIR) అంశంపై ప్రతిపక్ష కూటములు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా బీజేపీ దేశవ్యాప్తంగా మహా పాదయాత్రలకు సిద్ధమైందని తెలిపారు. ఇందులో భాగంగా దేశంలోని 40 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 23న కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. దాదాపు లక్ష మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పెద్ద సంఖ్యలో కరీంనగర్‌కు తరలిరావాలని గొల్లపల్లి వీరాచారి కోరారు. మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.