భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని TRS పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూరెళ్ళ శ్రావణ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం TRS పార్టీ నూతన కార్యాలయాన్ని శ్రావణ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారాన్ని వెంటనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన వారితో పాటు బావులు, చెట్లు, ఇతర నిర్మాణాలు కోల్పోయిన బాధితులకు కూడా నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు.
ప్రజలకు పార్టీ కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి వారం రెండు రోజుల పాటు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన పాంచజన్య పథకంలోని ఉచిత విద్య, వైద్య విధానాలు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని శ్రావణ్ కుమార్ గౌడ్ అన్నారు. మహిళలు, యువతతో పాటు వివిధ వృత్తులకు చెందిన వారికి పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు.
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TRS కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి లింగంపల్లి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు లోకి రవిచంద్ర, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చిలుక ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.