భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

అంగన్వాడీల్లో తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం

తొలిముద్ద ను సద్వినియోగపరచాలి: సర్పంచి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తొలిముద్ద కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎర్రబెల్లిగూడెం సర్పంచి గుండెపోయిన ఉష అశోక్ సూచించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.

మండలంలోని ఎర్రబెల్లిగూడెం ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం సర్పంచి ఉష అశోక్, సూపర్‌వైజర్ జలగం సునీతతో కలిసి తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందించే అల్పాహారం, కార్యక్రమం అమలు లక్ష్యాల గురించి వివరించారు.

తొలిముద్ద ను సద్వినియోగపరచాలి: సర్పంచి

అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించేందుకు తొలిముద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవలను వినియోగించుకుంటూ పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి సాంబమూర్తి, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.