భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడమే చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రధాన ఉద్దేశమని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీ పట్టకుండా వాటిని అర్థం చేసుకుని సొంతంగా ఆలోచించే అలవాటు పెంచుకోవాలని సూచించారు.
ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్)లో శనివారం జన విజ్ఞాన వేదిక ఇనుగుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్–2026 నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.
పరీక్ష ప్రారంభానికి ముందు ఎంఈఓ వెన్న వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథం, విషయాలను విశ్లేషించే సామర్థ్యం, సందేహాలను ప్రశ్నించే అలవాటు పెరగాలని అన్నారు. చెకుముకి వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంచడంతో పాటు వారి ఆలోచనా శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
విద్యార్థులు ఏ విషయాన్నైనా కేవలం గుర్తుపెట్టుకోవడానికే పరిమితం కాకుండా దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలని, అర్థం చేసుకుని ఆలోచించే విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ఇనుగుర్తి గ్రామ సర్పంచి తమ్మడపల్లి కుమార్, స్థానిక హెచ్ఎం అమ్మ యాకయ్య, జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు దార్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఆది చందు, గౌరవ అధ్యక్షుడు చిన్నాల కట్టయ్య, గంజి వీరేందర్ రెడ్డి, కోశాధికారి గాడుదుల గణేష్, సమత కన్వీనర్ పొన్నం కవిత, చెకుముకి కన్వీనర్ వేముల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.
అలాగే వివిధ గ్రామాలకు చెందిన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఎం. మాధవ్, యాదగిరి, ప్రవీణ్ కుమార్, డి. శాలినితో పాటు వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.