భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి నోముల విజయకుమారి సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు.
నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి నోముల విజయకుమారి మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తుకు ప్రతీకలని, విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు కలిసి నషా ముక్త్ యువ సంకల్ప ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత రన్నింగ్, షాట్పుట్, జావెలిన్ త్రో, కబడ్డీ, ఖో-ఖో తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన అవగాహన నాటిక ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెరుగుతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల సమయపాలన, పట్టుదల, జట్టుగా పనిచేసే స్వభావం అలవడతాయని వివరించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం కూడా పెంపొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు కవి రాజు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, రామ్మూర్తి, సుధాకర్, బాబు, సతీష్, యాకన్న, అధ్యాపకేతర సిబ్బంది శ్రావణ్, ప్రదీప్, గౌరీ శంకర్, లక్ష్మణ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.