భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇంగ్లీష్ భాషపై విద్యార్థుల్లో ఆసక్తి, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ELTA) ఆధ్వర్యంలో మండల స్థాయి ఒలింపియాడ్, ఎడ్యు టాక్ పోటీలను శనివారం ఇనుగుర్తి స్థానిక హైస్కూల్లో నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
పోటీల్లో భాగంగా నిర్వహించిన సీనియర్ విభాగం ఒలింపియాడ్ పరీక్షలో కోమటిపల్లి ZPHS పదో తరగతి విద్యార్థి జె. జీవన్ ప్రథమ స్థానం సాధించగా, చిన్న ముప్పారం ZPHS పదో తరగతి విద్యార్థి అరుణ్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. జూనియర్ విభాగంలో ఇనుగుర్తి ZPHS ఎనిమిదో తరగతి విద్యార్థిని పింగిలి స్ఫూర్తి మొదటి స్థానం సాధించింది. కోమటిపల్లి హైస్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థిని మోక్షిత రెండో స్థానం దక్కించుకుంది.
ఎడ్యు టాక్ పోటీల్లోనూ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. సీనియర్ విభాగంలో కోమటిపల్లి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఇ. నవీన్ ప్రథమ స్థానం సాధించగా, ఇనుగుర్తి ZPHS పదో తరగతి విద్యార్థి వర్దోలు కార్తీక్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. జూనియర్ విభాగంలో ఇనుగుర్తి ZPHS ఎనిమిదో తరగతి విద్యార్థిని ధరావత్ యామిని మొదటి స్థానం సాధించగా, చిన్న ముప్పారం ZPHS విద్యార్థి బి. సాహిత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు తదుపరి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందించిన ఉపాధ్యాయులు, జిల్లా స్థాయిలోనూ ఇదే ఉత్సాహంతో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ZPHS ప్రధానోపాధ్యాయుడు అమ్మ యాకయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు బోడ దేవేందర్, మాధవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.