భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు హుస్నాబాద్ విద్యార్థిని అఖిల

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు అఖిల ఎంపిక...  అభినందించిన కాంగ్రెస్ నేత శ్రీనివాస్

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు తెలంగాణ బాలికల జట్టులో హుస్నాబాద్‌కు చెందిన విద్యార్థిని బానోత్ అఖిల ఎంపికై తన ప్రతిభ చాటుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించనున్న 44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అఖిల తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.

అక్కన్నపేట మండలం మల్‌చెరువు తండాకు చెందిన మల్లేష్ కుమార్తె బానోత్ అఖిల ప్రస్తుతం హుస్నాబాద్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం MPC చదువుతోంది. చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి చూపుతూ సాఫ్ట్‌బాల్‌లో సాధన చేస్తున్న ఆమె, రాష్ట్రస్థాయి పోటీల్లో తన ప్రతిభను నిరూపించుకుంది.

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు అఖిల ఎంపిక...  అభినందించిన కాంగ్రెస్ నేత శ్రీనివాస్

గత నెలలో నిర్మల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో అఖిల అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ ప్రదర్శన ఆధారంగా జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ బాలికల జట్టులో ఎంపికైంది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రం తరఫున ఆడే అవకాశం దక్కించుకోవడం పట్ల గ్రామస్తులు, క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అఖిల జాతీయ పోటీలకు ఎంపికైన సందర్భంగా మల్‌చెరువు తండా గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుగులోతు శ్రీనివాస్ ఆమెను అభినందించారు. జాతీయ స్థాయిలోనూ మంచి ప్రతిభ కనబరిచి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అఖిల సాధించిన విజయాన్ని గ్రామానికి గర్వకారణంగా అభివర్ణిస్తూ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెకు అభినందనలు తెలిపారు. జాతీయ పోటీల్లో తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.