భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే అంశంపై మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకం ముఖ్య ఉద్దేశాలు, ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, అలాంటి సమయంలో బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
కుటుంబాల ఆరోగ్య, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ఆపద సమయంలో వారు ఇతరులపై ఆధారపడకుండా ఆదుకోవడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. అర్హులైన కుటుంబాలు పథకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రజలకు పథకం ప్రయోజనాలను వివరించి, కుటుంబ భద్రత విషయంలో జీవిత బీమా ప్రాధాన్యతను తెలియజేశారు.