భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పవిత్ర కార్తీక మాసం సోమవారం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పురాతన భక్త మార్కండేయ దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక మాసంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో శివుడికి మొక్కులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయంలో శివలింగానికి రుద్రాభిషేకాలు నిర్వహించి, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పుష్పార్చనలు చేశారు. భక్తులు శివుడిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తెల్లవారుజాము నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొనగా, శివనామస్మరణ, పూజలు, దీపారాధనతో భక్తిపారవశ్య వాతావరణం ఏర్పడింది. పట్టణంలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరొందిన భక్త మార్కండేయ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజలకు భక్తులు ఎంతో ఉత్సాహంగా హాజరవుతున్నారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ కార్తీక మాస ఆధ్యాత్మిక విశిష్టతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మధ్యల రమేష్ స్వామి, పూజారి బలరాజయ్య, బల్ల సుధాకర్, బల్ల నవీన్, బల్ల శంకర్, దానరాజ్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.