భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

తొలిముద్ద కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచి సుజాత వాసు

తొలిముద్ద సద్వినియోగం చేసుకోవాలి                        సర్పంచి సుజాత వాసు.

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలిముద్ద కార్యక్రమాన్ని చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా అమలు చేసి సద్వినియోగం చేసుకోవాలని సౌల్ల తండా సర్పంచి గుగులోతు సుజాత వాసు సూచించారు. మండలంలోని సౌల్ల తండా ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సర్పంచి సుజాత వాసు పలువురితో కలిసి తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించేందుకు తొలిముద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. చిన్నారులకు చిన్న వయస్సు నుంచే సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజరు శాతాన్ని పెంచడం, పిల్లలకు పౌష్టికాహారం అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కవిత, పద్మ, ఉంగరాణి, ఆయాలు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.