భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చదువుపై ఆసక్తిని పెంచే లక్ష్యంతో నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్పాహార పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు హాజరై విద్యార్థులకు అల్పాహారం అందించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, కౌన్సిలర్ సుధీర్ గౌడ్, మండల విద్యాధికారి తారా సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సామ్య నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడం వల్ల ఆరోగ్యంగా ఎదగడంతో పాటు చదువుపై మరింత శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు సరైన ఆహారం ఎంతో అవసరమని, పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడటంతో పాటు పాఠశాల వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.