భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, దానికి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి సూచించారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. జూట్ సంచుల వినియోగం పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా సమీపంలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో సోమవారం జూట్ బ్యాగుల తయారీపై కొత్త శిక్షణ బ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేడం లింగమూర్తి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూట్ బ్యాగుల తయారీలో నైపుణ్యం సంపాదించడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇంటి వద్దే జూట్ సంచులు తయారు చేసుకుంటూ ఉపాధి పొందేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ మహిళలు ఇలాంటి అవకాశాలను గుర్తించి శిక్షణలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధి మార్గాలుగా మార్చుకోవాలని కోరారు.
ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించేందుకు జూట్ బ్యాగులు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని, వీటి వినియోగంపై ప్రజల్లో కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు మరింత మందికి చేరువ కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సెట్విన్ హుస్నాబాద్ ఇన్‌ఛార్జి మహమ్మద్ కరీముద్దీన్, సెట్విన్ సిబ్బంది, శిక్షణకు హాజరైన మహిళలు తదితరులు పాల్గొన్నారు.