భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిముద్ద కార్యక్రమం నెల్లికుదురు మండలంలోని నాలుగు గ్రామాల్లో సోమవారం ప్రారంభమైంది. మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు వస్రాం తండా, మునిగలవీడు, మదనతుర్తి గ్రామాల్లో సెక్టార్ సూపర్వైజర్ సరిత ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నెల్లికుదురులో..
నెల్లికుదురు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో స్థానిక సర్పంచి పులి వెంకన్న తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవయ్య, అంగన్వాడీ టీచర్లు మద్ది విజయ, ఐ.పద్మ, ఎం.పద్మ, కె.పద్మ, జ్యోతి, మాధవి పాల్గొన్నారు. చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వస్రాం తండాలో..
వస్రాం తండా అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచి గుగులోతు కరుణ మధు తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తొట్ల వెంకటలక్ష్మి, వసంత, లక్ష్మి, ఆశా వర్కర్ శారద, చిన్నారులు, తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.
మునిగలవీడులో..
మునిగలవీడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో స్థానిక సర్పంచి దొలికొండ చైతన్య నాగరాజు చిన్నారులకు అల్పాహారం వడ్డించి తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు వీరలక్ష్మి, జమాల్బి, మహతి, వెంకటమ్మతో పాటు చిన్నారులు, తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.
మదనతుర్తిలో..
మదనతుర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కూడా తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచితో పాటు అంగన్వాడీ టీచర్లు ఎం.పుష్పలత, జి.సత్తెమ్మ పాల్గొని చిన్నారులకు అల్పాహారం అందించారు.
తొలిముద్దతో పోషకాహారం: సర్పంచులు
ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు కరుణ మధు, దొలికొండ చైతన్య నాగరాజు, పులి వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని 3 నుంచి 6 సంవత్సరాల లోపు ప్రీ స్కూల్ చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించేందుకు తొలిముద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారులను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు.