భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. అదే విధంగా గ్రామాల్లో జల సంరక్షణ కార్యక్రమాలను వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియతో పాటు జలసిరి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీమా పథకానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలను ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిగా నింపేలా చూడాలని సూచించారు. ఈ పథకం కింద కుటుంబంలోని 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తిని బీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదించే అవకాశం ఉంటుందని వివరించారు. బీమా పొందే వ్యక్తి స్వయంగా దరఖాస్తుపై సంతకం చేయడంతో పాటు నామినీ వివరాలను స్పష్టంగా తెలియజేసి దరఖాస్తును అందించాలని పేర్కొన్నారు.
స్వీకరించిన దరఖాస్తుల్లోని వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా నామినీ ఎంపిక విషయంలో సంబంధిత లబ్ధిదారుల నుంచి భౌతికంగా సంతకాలు తీసుకోవాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
జలసిరి పనుల్లో వేగం పెంచాలి
అనంతరం జలసిరి పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను ప్రజల భాగస్వామ్యంతో వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. నీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు.
జలసిరి పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూడటంతో పాటు, భవిష్యత్తు అవసరాల కోసం నీటి వనరులను సంరక్షించే కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.