భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం బస్వాపురం గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయాలను తెలంగాణ రక్షణ సేన పార్టీ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దండె అపర్ణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
తన పర్యటనలో భాగంగా ముందుగా గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న దండె అపర్ణ, అనంతరం శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు స్థానిక నాయకులు, ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా దండె అపర్ణ మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.