భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

భైంసాలో పాన్ షాపులకు పోలీసుల నోటీసులు.. ఏడు రోజుల డెడ్‌లైన్

విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలపై పోలీసుల కొరడా..

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై భైంసా రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించడం చట్టరీత్యా నేరమని భైంసా రూరల్ ఎస్సై సుప్రియ స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాన్ షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలపై పోలీసుల కొరడా..

COTPA చట్టం ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం, విక్రయానికి ఉంచడం నిషేధం. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు దుకాణదారులకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాల యజమానులకు నోటీసులు అందజేశారు.

నోటీసులు అందుకున్న దుకాణదారులు వెంటనే పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని, షాపుల్లో నిల్వ ఉన్న పొగాకు ఉత్పత్తులను తొలగించాలని పోలీసులు ఆదేశించారు. అలాగే 18 ఏళ్లలోపు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదని హెచ్చరించారు.

విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలపై పోలీసుల కొరడా..

నోటీసులు అందుకున్న ఏడు రోజులలోగా నిబంధనలు పాటించినట్లు పోలీస్ స్టేషన్‌కు ధృవీకరణ ఇవ్వాలని సూచించారు. ఈ నిబంధనలను పట్టించుకోకుండా ఉల్లంఘనలకు పాల్పడితే COTPA చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భైంసా రూరల్ ఎస్సై సుప్రియ హెచ్చరించారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటం, విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలను నియంత్రించడమే లక్ష్యంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల దగ్గర పొగాకు విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల నిఘా, చర్యలు కొనసాగనున్నాయి.