భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి మృతి ఘటన కలకలం రేపింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న సంపత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందినవాడిగా గుర్తించారు.
విద్యార్థి మృతిని గుర్తించిన ఆర్జీయూకేటీ అధికారులు, సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం సంపత్ మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భైంసా ASP సాయి కిరణ్, CIs ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు తెల్లవారుజామున పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటనపై మృతుడి తల్లి పలు విషయాలను వెల్లడించారు. తన కుమారుడు డబ్బులు కావాలని అడగడంతో రెండు విడతల్లో సుమారు ₹.80వేల వరకు పంపించానని తెలిపారు. ఆ డబ్బులను ఏమైనా ఆటలో పోగొట్టుకున్నాడా అనే విషయం తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో కొందరు చెప్పిన విధంగా డబ్బులు పెట్టి నష్టపోయాడేమో కూడా తెలియడం లేదని అన్నారు. తన కుమారుడికి పెద్దగా ఏమీ తెలియదని, అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.
మృతుడి అన్న మాట్లాడుతూ.. తన తమ్ముడు ఒత్తిళ్లకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అయితే ఆ ఒత్తిళ్లకు కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై భైంసా ASP సాయి కిరణ్‌ను వివరణ కోరగా, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
విద్యార్థి ఆత్మహత్యకు ఆన్లైన్లో డబ్బుల వ్యవహారం కారణమా? ఇతరత్రా ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు తరచూ వెలుగులోకి రావడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల మానసిక ఒత్తిళ్లు, వారి సమస్యలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.