భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం

వృద్ధులు, దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాల పంపిణీ  నేడు అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలిచి వారి రోజువారీ పనులను మరింత సులభతరం చేసేందుకు హుస్నాబాద్‌లో ఉచిత సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అలింకో సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 24న ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్న రాజు తెలిపారు.

ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని వృద్ధులు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. వారికి అవసరమైన సహాయ పరికరాలను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో అలింకో సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈ శిబిరం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమవంతు సహకారం అందించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమం గురించి సమాచారం చేరవేసి, వారు శిబిరానికి వచ్చేలా చూడాలని సూచించారు.

హుస్నాబాద్ మండల పరిధిలోని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై ఉచిత సహాయ పరికరాల పంపిణీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెన్న రాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన వారికి తోడ్పాటు అందడంతో పాటు వారి దైనందిన జీవనంలో ఇబ్బందులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.