భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గురునానక్ జయంతి వేడుకలను పురస్కరించుకుని రామాయంపేటలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో జాతీయ రహదారి 44 పక్కన ఉన్న గురునానక్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు, స్థానిక నాయకులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా హాజరై గురునానక్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గురునానక్ బోధించిన మానవత్వం, సమానత్వం, సోదరభావం, ప్రేమ, శాంతి వంటి విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు.
సమాజంలో కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలనే గురునానక్ సందేశం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం, బోధించిన ఆశయాలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ విలువలను తమ జీవితాల్లో ఆచరిస్తూ ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పుట్టి సందీప్, దేవుని రంజిత్, డాకి స్వామి, చింతల యాదగిరి, మాజీ కౌన్సిలర్ సుందర్ సింగ్, దిమే యాదగిరి, అర్జున్ సింగ్, బాబు సింగ్, సిక్కి సోదరులు తదితరులు పాల్గొన్నారు.