భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

నెల్లికుదురు, ఇనుగుర్తి శివాలయాల్లో ఘనంగా అభిషేకాలు

నెల్లికుదురు, ఇనుగుర్తి శివాలయాల్లో ఘనంగా అభిషేకాలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లికుదురు, ఇనుగుర్తి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రెండు ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకోవడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.

నెల్లికుదురు శివపార్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు

మండల కేంద్రం నెల్లికుదురులోని శ్రీ శివపార్వతి సహిత భక్త మార్కండేయ స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. భక్తులు 'ఓం నమశ్శివాయ' అంటూ శివనామ స్మరణ చేస్తూ శివపార్వతులతో పాటు భక్త మార్కండేయ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

నెల్లికుదురు, ఇనుగుర్తి శివాలయాల్లో ఘనంగా అభిషేకాలు

ఆలయ అర్చకులు, మానుకోట జిల్లా ఎండోమెంట్ కన్వీనర్, ప్రముఖ బ్రాహ్మణోత్తములు శ్రీశ్రీశ్రీ వెలుకూచి నాగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పంచామృతాలతో రుద్రాభిషేకాలు నిర్వహించి దీపారాధన చేశారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

ఇనుగుర్తి చారిత్రక శివాలయంలో భక్తుల సందడి

ఇనుగుర్తిలోని చారిత్రక మహిమాన్విత శివాలయం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే ఇనుగుర్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన చిన్ననాగారం, మీట్య తండా, చీన్య తండా, అయ్యగారిపల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చారు. చారిత్రక శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నెల్లికుదురు, ఇనుగుర్తి శివాలయాల్లో ఘనంగా అభిషేకాలు

ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తులు రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కో పేరున 365 వత్తులతో దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. వందలాది దీపాల కాంతులతో ఇనుగుర్తి శివాలయం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ శివనామ స్మరణతో మారుమోగాయి.

ఉసిరి చెట్లకు ప్రత్యేక పూజలు.. దీపాల వెలుగులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఉసిరి చెట్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, బ్రహ్మదేవుడితో పాటు సకల దేవతలు నివసిస్తారనే నమ్మకం భక్తుల్లో ఉంది. ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఉసిరికాయలో ఆవు నెయ్యి, వత్తి వేసి దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు, నరదిష్టి తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఈ నమ్మకంతో భక్తులు ఉసిరి చెట్లకు పూజలు చేసి దీపాలు వెలిగించారు. శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఉసిరి చెట్ల వద్ద దీపారాధనతో నెల్లికుదురు, ఇనుగుర్తి ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిభావంతో ఘనంగా జరిగాయి.