భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఇనుగుర్తి ఆలయంలో భక్తుల సందడి.. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ఇనుగుర్తి ఆలయంలో భక్తుల సందడి.. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంలోని చారిత్రక, మహిమాన్విత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఇనుగుర్తితో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

అర్చక సమాఖ్య రాష్ట్ర నేత, ప్రముఖ వేద పండితులు, ఆలయ అర్చకులు శ్రీశ్రీశ్రీ తిరునహరి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మూలవిరాట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పంచామృత అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఇనుగుర్తి ఆలయంలో భక్తుల సందడి.. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ఈ కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రత కథలను భక్తితో విన్నారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారింది. గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత వద్దిరాజు కిషన్ సతీమణి శశిరేఖ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా అర్చక సమాఖ్య రాష్ట్ర నేత కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 25 జంటలు వ్రతాల్లో పాల్గొన్నాయని చెప్పారు. ఏటా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ భక్తులకు స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.

ఇనుగుర్తి ఆలయంలో భక్తుల సందడి.. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

భక్తులకు మహాన్న ప్రసాద వితరణ

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ముగిసిన అనంతరం ఆలయానికి వచ్చిన అశేష భక్తులకు మహాన్న ప్రసాద వితరణ నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా వజినేపెల్లి శ్రీధర్, కవిత దంపతులు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా దంపతులు భక్తులకు మహాన్న ప్రసాదాన్ని అందించారు. స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలతో పాటు అన్నప్రసాదం స్వీకరించడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.