భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ హుస్నాబాద్ డివిజన్ ఇన్చార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ అధికారులు, పాలకవర్గాన్ని కోరారు. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వృద్ధులు, దివ్యాంగులు వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు పై అంతస్తులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మున్సిపల్ కార్యాలయంలో లిఫ్టు ఏర్పాటు చేయాలనే విషయాన్ని గతంలో పలుమార్లు కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్లు మారుతున్నా ప్రజలకు అవసరమైన లిఫ్టు సౌకర్యం మాత్రం అందుబాటులోకి రావడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి పనులు చేపడతామని ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులతో పాటు పాలకవర్గంపై ఉందని గుర్తుచేశారు.
మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపడం, పూర్తిస్థాయి కమిషనర్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మున్సిపల్ అభివృద్ధి పనులు మందగిస్తున్నాయని కవ్వ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ నెల 26న దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలోనైనా లిఫ్టు ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు కార్యాలయానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు, పాలకవర్గం ఈ సమస్యపై తక్షణమే స్పందించి లిఫ్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కవ్వ వేణుగోపాల్ రెడ్డి కోరారు.