భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

రెడ్డిపల్లిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సర్పంచ్ పద్మావతి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నరసాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న జీవిత బీమా పథకం ప్రయోజనాలను గ్రామ ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఈ పథకం భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా చాటుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద కుటుంబాలకు పెద్ద కొడుకులా అండగా నిలుస్తూ ఆర్థిక, సామాజిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

గ్రామంలోని అర్హులైన కుటుంబాలన్నీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.